Wednesday 5 July 2017

RASHTRIYA SWAYAMSEVAK SANGH

కొద్దికాలంలోనే దేశవ్యాప్తమైన ఆర్.ఎస్.ఎస్.

ఆర్.ఎస్.ఎస్. ప్రారంభమై 90 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ప్రత్యేకం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని 1925లో విజయదశమి శుభ ముహూర్తాన డా.కేశవ బలీరాం హెడ్గేవార్ స్థాపించారనే సంగతి ఈనాడు అందరికీ తెలిసినదే. కాని డా||హెడ్గేవార్ ఎవరు, ఆయన ఈ సంస్థను ఎందుకు ప్రారంభించారనేది మాత్రం మనలో చాలా మందికి తెలియదు.

ఆజన్మ దేశభక్తుడు

నాగపూర్ నివాసియైన డా||హెడ్గేవార్ జన్మతః దేశభక్తులు. భారత్లో బ్రిటిషు వారి పాలనను కూలద్రోయాలనే ప్రబలమైన కాంక్ష పసితనం నుండే ఆయనలో గూడు కట్టుకొని ఉంది. 9-10 ఏళ్ళ వయస్సులో ఆయన మూడో తరగతి చదువుతున్నాడు. విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవాల సందర్భంగా పంచి ఇచ్చిన మిఠాయిలను కేశవుడు (హెడ్గేవార్) చెత్త బుట్టలోకి విసిరి కొట్టాడు. కిశోర ప్రాయంలోని కేశవుడిలో ఈ లక్షణం కాలక్రమంలో మరింతగా వికసించింది. మెట్రిక్యులేషన్ చదువు తుండగా ఒకసారి పాఠశాల ఇన్స్పెక్షన్ జరుగు బోతున్నది. ‘వందేమాతరం’ పలకటం బ్రిటిషు వారి దృష్టిలో రాజద్రోహం కనుక ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు ‘వందేమాతరం’ నినాదంతో స్వాగతించాలని కేశవుడు నిశ్చయించుకున్నాడు. మెట్రిక్యులేషన్ తరగతికి చెందిన రెండు డివిజన్లలోని విద్యార్థులను సమావేశ పరచి వారికి తన పథకం వివరించాడు. ఇన్స్పెక్టర్ అన్ని తరగతి గదులలో అడుగు పెట్టగానే విద్యార్థులు ‘వందేమాతరం’ అని నినదించటం వినగానే ఆయనకు ఒళ్ళు మండింది. కోపంతో ప్రధానో పాధ్యాయుణ్ణి పిలిచి ‘ఈ సంఘటనపై విచారణ జరిపి దీని వెనుక పథకం వేసినదెవరో కనిపెట్టి చెప్పాల’ న్నాడు. ‘నాయకుడెవ’రని ప్రధానోపాధ్యాయుడు ఎంత విచారణ జరిపినా ఆయనకు ఎలాంటి ఆధారం లభించలేదు. చివరకు మెట్రిక్యులేషన్ విద్యార్థుల నందరినీ తొలగించాలని నిర్ణయించాడు. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంది ప్రధానోపాధ్యాయుణ్ణి కలుసుకున్నారు. ‘విద్యార్థులంతా వ్రాత పూర్వకంగా క్షమాపణలు తెలిపాల’ని అడిగితే విద్యార్థులు అందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు ప్రయత్నాలు సాగించగా చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రతి విద్యార్థిని ‘నీవు తప్పు చేశావా’ అని ప్రధానోపాధ్యాయుడు అడగాలని సదరు విద్యార్థి తల ఊపి ఒప్పుకోవాలని నిర్ణయం జరిగింది. అలా విద్యార్థులంతా తల ఊపి తిరిగి ప్రవేశం పొందారు – ఒక్క కేశవుడు తప్ప !

దాదాపుగా అదే సమయంలో బాబాసాహెబ్ పరంజపే అనే ఒక ప్రసిద్ధ వ్యక్తి యవత్మాల్లో జాతీయ విద్యాబోధనకై ఒక పాఠశాల ప్రారంభించాడు. డా||మూంజే గారి సిఫారస్సుతో కేశవుడు ఆ పాఠశాలలో చేరాడు. కొద్ది కాలంలో బ్రిటిషు ప్రభుత్వం ఆ పాఠశాలను నిషేధించింది. అప్పుడు కేశవుడు తన మిత్రులతో పుణే వెళ్ళి అక్కడ కలకత్తా జాతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పాఠశాలలో చేరాడు. అక్కడ రెండు నెలలు చదివిన మీదట తమ పరీక్షా కేంద్రంగా వారు అమరావతిని ఎంచుకున్నారు. కేశవుడు ఆ పరీక్షలో విజయం సాధించాడు. మహా విప్లకారుడైన డా||రాస బిహారీ బోస్ స్వయంగా సంతకం చేసిన సర్టిఫికెట్ కేశవుడికి లభించింది.

విప్లవ కారులతో

కేశవుడికి మొదటి నుంచి విప్లవ కార్యకలా పాలపట్ల ఆకర్షణ ఉండేది. అప్పట్లో కలకత్తా విప్లవాలకు కంచుకోటగా ఉండేది. 1910లో తన వైద్య విద్యకోసం ఉద్దేశపూర్వకంగానే కలకత్తాను ఎంచుకొని, విప్లవకారులతో హార్దిక సంబంధాలు నెల కొల్పుకున్నాడు కేవవరావ్. కాలక్రమంలో విప్లవకారుల అత్యున్నత సంస్థయైన అనుశీలన సమితిలో క్రియాశీల సభ్యుడైనాడు. 1914లో వైద్య విద్యలో లైసెన్సియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ (ఎల్.యం.ఎస్.) పూర్తి చేసుకొని 1916లో నాగ పూర్కు తిరిగి వచ్చారు. అప్పటినుంచి కేశవరావుని అందరూ డా||హెడ్గేవార్ అనీ, డాక్టర్జి అని పిలువ సాగారు.

కాంగ్రెసులో ప్రవేశం

కలకత్తాలో విప్లవకారులతో పనిచేసినప్పుడు ఎవరో ఒకరిద్దరు బ్రిటిషు అధికారులను హతమార్చి నంత మాత్రాన దేశ స్వాతంత్య్రం సాధించ జాలమని ఆయన గ్రహించారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్న లోకమాన్య తిలక్ అప్పట్లో కాంగ్రెసులో అగ్ర నాయకుడిగా ఉంటూ తన కార్యశైలిలో, దృఢచిత్తంతో యువకులను చైతన్య పరుస్తుండేవారు. డా||హెడ్గేవార్ మనస్ఫూర్తిగా కాంగ్రెసు ఉద్యమంలో చేరారు. చాలాచోట్ల దూకుడుగా ఉపన్యాసాలు ఇవ్వసాగారు. బ్రిటిషు ప్రభుత్వం ఆయన ప్రసంగాలను నిషేధించింది. కానీ ఆయనను అదుపు చేయలేక పోయింది. చివరకు బ్రిటిషువారు ఆయన మీద రాజద్రోహ చట్టాల క్రింద కేసు నమోదు చేశారు. కోర్టులో డాక్టర్జీ తన తరఫున తానే వాదించుకున్నారు. ఆయన చర్యలు రాజద్రోహకరమైనవిగా కోర్టు పరిగణిస్తూ ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ 1921 ఆగస్టు 19న తీర్పునిచ్చింది. 1922 జులై 12 ఆయన విడుదల అయినప్పుడు వెంకటేశ్ థియేటర్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి పండిట్ మోతీలాల్ నెహ్రూ, హకీం అజ్మల్ ఖాన్ వంటి జాతీయ స్థాయి కాంగ్రెసు నాయకులు హాజరయ్యారు.

1920లో లోకమాన్య తిలక్ స్వర్గస్థులు కాగా కాంగ్రెసు పగ్గాలు మహాత్మాగాంధీ చేతుల్లోకి వెళ్ళాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత టర్కిస్తాన్కు రాజుగా ఉన్న సాంప్రదాయిక ‘ఖలీపా’ పదవి రద్దు అయింది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఆగ్రహించారు. స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలకు భాగస్వామ్యం కల్పించే ఉద్దేశంతో, ఈ ఆగ్రహాన్ని వినియోగించుకునే నిమిత్తం ఖిలాఫత్ ఉద్యమానికి మహాత్మాగాంధీజీ మద్దతు పలికారు. ముస్లింలు తమ కోపాన్ని బ్రిటిషు పాలకుల మీద చూపక తమ ఇరుగు పొరుగు హిందువులపై చూపిస్తూ వారిపై దాడులు ప్రారంభించారు. ఇందుకు బలమార్లో జరిగిన ‘మోఫ్లా తిరుగుబాటు’ ఒక చక్కని ఉదాహరణ. వారు హిందువులను ఊచకోత కోశారు. దయాభిక్ష వేడుకున్న వారిని ఇస్లాం మతంలోకి మార్చారు. హిందూ స్త్రీలను చిత్ర హింసలకు గురి చేశారు.

ఆర్.ఎస్.ఎస్. అవతరించింది

ఖిలాఫత్ ఉద్యమం గురించి మహాత్మాగాంధీతో డా||హెడ్గేవార్ చర్చించారు. గాంధీజీ సమాధానం సంతృప్తికరంగా లేదు. దీనితో డా||హెడ్గేవార్ మనస్సులో ఒక నూతన ఆలోచనా తరంగం వెలువడింది. హిందూస్థాన్ భవిష్యత్తు హిందూ సమాజంతో ముడిపడి ఉన్నదని ఆయన గ్రహించారు. హిందూ సంఘటన గురించిన ఆలోచన ఆయన మనస్సును వెన్నాడసాగింది. దీని ఫలితంగానే 1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని డాక్టర్జి స్థాపించారు.
సంఘ స్థాపన సమయంలో డాక్టర్జి వెంట అనుభవజ్ఞులైన ఎంతోమంది ఉన్నారు. కాని ఆయన 12-14 సంవత్సరాల వయస్సులోని బాలలతో ఒక దైనందిన శాఖను ప్రారంభించారు. దైనందిన శాఖ అనేది ఆర్.ఎస్.ఎస్.లోని ఒక విశిష్ట లక్షణం. ఇది ఎన్నో అద్భుతాలకు దారి తీసింది. హిందువుల మధ్య ఎన్నో రకాల విభేదాలున్నాయి. వాటినన్నింటిని దైనందిన శాఖ నిర్మూలించి వేసింది. కొంతమంది సంస్కర్తలు ఈ విభేదాలను రూపుమాపడానికి వాటి మీదనే దృష్టి పెట్టారు. డా||హెడ్గేవార్ మాత్రం వాటిని వీలైనంతగా తగ్గించడానికి ‘హిందూ’ అనే పెద్ద గీతను గీయటానికి బుద్ధిపూర్వకంగా నిశ్చయించుకున్నారు.
1932లో అంటరాని వారు అనబడే కులాలకు చెందిన 8 నుంచి 10 మంది స్వయంసేవకులు ఆర్.ఎస్.ఎస్. హేమంత శిబిరానికి వచ్చారు. ఆ శిబిరంలో ఇతర కులాలకు చెందిన కొందరు స్వయంసేవకులు తాము ఆ స్వయంసేవకులతో కలసి భోజనం చేయలేమంటూ డాక్టర్జీకి తమ అభ్యంతరం తెలియజేశారు. డాక్టర్జీకి ప్రతిస్పందనలో కాఠిన్య మేమీ లేదు. ‘అలాగే, మీరు విడిగా భోం చేయండి. నేను అందరితో కలసి తింటాను’ అని మాత్రమే అన్నారు. అంటరాని వారు అనబడే వారితో సమస్యలున్న 10-12 మంది స్వయంసేవకులు తామే ఒక విధమైన అంటరానివారుగా అయ్యామని భావించి, చివరికి వారు కూడా అందరితో కలిసి భోజనం చేయటం ప్రారంభించారు.
సంఘశాఖలో ‘ఏకశః సంపత’ అనే ఆదేశం ఒకటి ఉంది. ‘ఒక పంక్తిలోకి రండి’ అని దాని అర్థం. ఈ ఆదేశంలో విప్లవాత్మకమైన ప్రభావముంది. ఈ ఆదేశంతో చదువుకున్న వారు, నిరక్షరాస్యులు, ధనికులు, పేదలు, ఈ కులం వారు, ఆ కులం వారు, వగైరా అందరూ ఒకే పంక్తిలో నిలుస్తారు. ఆ పైన వారు కలిసి నడుస్తారు. కలిసి భుజిస్తారు. సాదా సీదా పద్ధతులతో డాక్టర్జీ ఐకమత్యం, ఏకాత్మతల విలువను పెంపొందిచారు.

సంస్కృత ప్రార్థన

సంఘకార్యం దేశవ్యాప్తం చేసే విషయంలో డా||హెడ్గేవార్కు ఒక స్పష్టమైన కల్పన ఉంది. 1939 వరకు సంఘ ప్రార్థన సగం మరాఠీలోను, సగం హిందీలోను ఉండేది. సంఘ శాఖలోని ఆజ్ఞలు కూడా ఎక్కువ భాగం అలాగే ఉండేవి. ఈ విషయమై చర్చించడానికి నాగపూర్ సమీపంలోని సింధి వద్ద ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యులైన ఏడెనిమిదిమంది మంది 10 రోజుల పాటు మేథోమథనం జరిపారు. డాక్టర్జీతో పాటు శ్రీ గురూజీ, శ్రీ అప్పాజీ జోషి, శ్రీ బాలాసాహెబ్ దేవరస్ మొదలైనవారు అందులో ఉన్నారు. రోజుకు 8 గంటల పాటు చర్చలు సాగించిన మీదట మరాఠీలో భావం కూర్చారు. దానిని నాగపూర్కు చెందిన శ్రీ నరహరి నారాయణ్ భిడే భారతీయ భాషలన్నిటికి మాతృస్థానంలో ఉన్న సంస్కృత భాషలోకి ప్రార్థనను అనువదించారు. అన్ని ఆజ్ఞలను కూడా సంస్కృత భాషలోకి మార్చారు. అలా 1940లో సంఘ ప్రార్థన అమలులోకి వచ్చింది.

గురు దక్షిణ
డా||హెడ్గేవార్ మరో వినూత్న పద్ధతిని రూపొందించారు. అదే ‘గురు దక్షిణ’. సంఘం ఎవరి నుంచి విరాళాలను అడగరాదని నిశ్చయించింది. సభ్యత్య రుసుమైనా లేదు. ప్రతి స్వయంసేవక్ ఏడాదిలో ఒక మారు గురువుకు కృతజ్ఞతా పూర్వకంగా సమర్పణ చేస్తాడు. గురువు ఎవరో వ్యక్తి కాదు. పవిత్రకు, త్యాగానికి, పరాక్రమానికి చిహ్నమైన భగవాధ్వజం! ఏ వ్యక్తినీ గురువుగా పరిగణించటం లేదు. ఎవరి పేరు మీదగానీ జయజయ ధ్వానాలు చేయటమనేది లేదు. శాఖలో నిత్య ప్రార్థన తదుపరి ‘భారత్మాతాకీ జై’ చెప్పాలని సంఘం నిశ్చయించింది. గత 91 సంవత్సరాలుగా ఆర్.ఎస్.ఎస్. శాఖల్లో చేస్తున్న నినాదం ఇదొక్కటే. కృతజ్ఞతా పూర్వకంగా సమర్పణ చేసిన ధనం సంఘకార్యానికి నిజంగా ప్రయోజనం కలిగించింది. కనుకనే ఆర్.ఎస్.ఎస్. స్వావలంబనతో, స్వతంత్రంగా నిలిచింది.

సంఘం దేశవ్యాప్త విస్తరణ

విస్తరణ విషయంలోనూ సంఘానికి ఒక విశిష్టమైన పద్ధతి ఉన్నది. ప్రకటనల ద్వారానో, ఉపన్యాసాల ద్వారానో ఆర్.ఎస్.ఎస్. పెరగలేదు. సంఘ కార్యకర్తల నిరంతర ప్రయత్నాలతోనే పెరిగింది. అప్పట్లో కార్యాలయాలు ఉండేవి కావు. నాగపూర్లో కూడా 1946లో మాత్రమే ఆర్.ఎస్.ఎస్. జాతీయ స్థాయి స్వంత కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగింది. అప్పటిదాకా సంఘం ఒక అద్దె ఇంట్లోనే పని చేసింది. కాని సంఘ సందేశాన్ని దేశం నలుమూలలకూ తీసుకుపోవలసి ఉంది. ఇందుకుగాను డాక్టర్జీ ఒకింత స్థితిమంతులైన కుటుంబాలకు చెందిన యువకులను ఉన్నత విద్యాభ్యాసానికి ఇతర ప్రాంతాలకు వెళ్ళేలా ప్రోత్సహించారు. ఆ ప్రకారం రాజాభావు పాతుర్కర్ కాలేజిలో చేరటానికి లా¬ర్ వెళ్ళాడు. వార్థాకు చెందిన బాబా కళ్యాణి సియాల్కోట / రావల్పిండికి వెళ్ళాడు. పవనార్కు చెందిన మూంజే పంజాబ్ వెళ్ళాడు. భయ్యాజీ దాణే వారణాసి వెళ్ళాడు. భావూరావ్ దేవరస్ నాగపూర్ విశ్వవిద్యాలయంలో బి.ఏ. పూర్తి చేయగా ఆయనను కామర్స్ డిగ్రీ చదువమని ప్రోత్సహించారు. ఆయన లక్నో వెళ్లి బి.కాం, ఎల్.ఎల్.బి. పూర్తి చేశాడు. వీరందరూ సంఘ సందేశ వ్యాప్తికోసం పనిచేశారు. భావూరావ్ దేవరస్ వంటివారు ఎంత గొప్పవారంటే ఆయన దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయి వంటివారిని స్వయంసేవకులుగా తయారు చేశారు. ఆర్.ఎస్.ఎస్. ద్వితీయ సర్సంఘచాలకులైన శ్రీ గురూజీని భయ్యాజీ దాణీ వారణాసిలో కనిపెట్టారు. నాగపూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన మీదట కొందరు స్వయంసేవకులను ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరేలా డాక్టర్జీ ప్రోత్సహించారు. అలా గోపాల్ ఎల్కుంటవార్ ముంబైకి, దాదారావ్ పరమార్థ్ మద్రాసు (నేటి చెన్నై) కి వెళ్ళారు. భావూరావ్ బెంగాల్కు, దివాకర్ బిహార్కు వెళ్ళారు. అనంతర కాలంలో ‘తరుణ్ భారత్’కు ముఖ్య సంపాదకుడైన బాపూసాహెబ్ భిషీకర్ కరాచీ వెళ్ళాడు. వారిలో కొందరు కొద్ది సంవత్సరాల తర్వాత వెనక్కి రాగా, మరికొందరు యావజ్జీవితం ప్రచారకులుగా ఉండి పోయారు. ఇలా సంఘం భారతదేశ వ్యాప్తంగా వ్యాపించి ‘ఇంతింతై- వటుడింతై’ అన్నట్లుగా పెరిగింది.
1940 జూన్ 21న డాక్టర్ హెడ్గేవార్ తుదిశ్వాస విడిచారు. వ్యాధితో ఎంతగానో బాధపడుతున్నా 1940 జూన్ 9న సంఘ శిబిరాన్ని ఆయన సందర్శిం చారు. సమారోప్ ఉత్సవంలో మాట్లాడుతూ ‘నా ఎదుట భారతదేశాన్ని సూక్ష్మరూపంలో చూడగలుగు తున్నాను’ అన్నారు. 1937 నుండి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారు అస్సాం మినహా అన్ని ప్రాంతాలలో సంఘ శాఖలు ప్రారంభించారు. దీని ఫలితంగానే 1940లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. శిబిరంలో ఈ ప్రాంతాలన్నిటి నుంచి స్వయంసేవకులు పాల్గొన్నారు.

జైహింద్...
భారత్ మాతా కీ జై...

Thursday 27 March 2014

పరిశ్రమద్వారా ఆత్మవిశ్వాసం

                 పరీక్షా  ఫలితాలు వచ్చాయి. ఫలితాలు వినిపించేందుకు ఆచార్యుడు వచ్చినిలుచున్నాడు. విద్యార్థులందరి పేర్లు చదివి వినిపించాడు, ఒక విద్యార్థి లేచి చెప్పాడు,నా పేరు చదవలేదు. క్రమశిక్షణను ఆశించే ఆచార్యుడు, నీవు ఉత్తిర్ణుడవు అయివుండవు అని చెప్పాడు. ఆ యేడు ఆ విద్యార్థి చాలా కాలం మలేరియా పిడించింది. అందువల్ల అతను ఉత్తీర్ణుడై వుండడని ఆచార్యునికి అనిపించింది. ఇలా జరగటానికి వీలులేదు అన్నాడా బాలుడు ఆత్మవిశ్వాసంతో. అలాగే జరిగింది, అని ఆచార్యుడు చెప్పాడు. 'లేదు' అలా జరగటానికే వీలు లేదు. 'నేను చెబుతున్నాను కూర్చో. ఇంకేమైనా మాట్లాడావంటే జరిమానా వేస్తాను.' 'నేను ఉత్తిర్ణుడనయ్యాను. ఇందులో ఏమాత్రం సందేహంలేదు.ఐదు ఐదు రూపాయలు జరిమానా.' విద్యార్థి పట్టుదలతో తాను ఫెయిల్ కావటానికి అవకాశమే లేదని చెబుతూనే ఉన్నాడు. ఆచార్యుడు జరిమానా మొతాన్ని పెంచుతూ పోసాగాడు . జరిమానా మొత్తం 50 రూ.ల  దాకా పెరిగిపోయింది .ఆ సమయములో అక్కడికి పాఠశాల లేఖరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాలుడికి సైగ చేసి తెలియయచేప్పాడు. తరువాత తెలిసింది. ఆ బాలుడే రాజేంద్రప్రసాద్. ఆయనే స్వాతంత్ర్య భారతదేశానికి  ప్రథమ రాష్ట్రపతి అయినాడు.